Site icon TeluguMirchi.com

Vijay Sethupathi: ‘జైలర్-2’ తర్వాత ఆ రోల్స్‌కు గుడ్‌బై చెబుతున్నా.. విజయ్ సేతుపతి

Vijay Sethupathi

Vijay Sethupathi: తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి తాజాగా తన సినీ ప్రయాణం, గెస్ట్ రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రత్యేక పాత్రలు లేదా క్యామియో రోల్స్ చేయబోనని స్పష్టం చేసిన ఆయన, సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం మాత్రం ఒక మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ సేతుపతి.. ‘జైలర్-2’ సినిమాలో తాను క్యామియో పాత్రలో నటించడానికి ప్రధాన కారణం రజినీకాంత్ అని చెప్పారు. ఆయనపై ఉన్న గౌరవం, అభిమానంతోనే ఆ పాత్రను అంగీకరించినట్లు వెల్లడించారు.

అలాగే గెస్ట్ రోల్స్ విషయంలో తన నిర్ణయానికి గల కారణాన్ని కూడా వివరించారు. భారీ స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ పాత్ర చేసినా ప్రేక్షకుల దృష్టి ఆ స్టార్ హీరోపైనే ఉంటుందని, ఉదాహరణకు ‘జైలర్-2’ పోస్టర్‌లో తన ఫొటో ఉన్నా ప్రేక్షకులు రజినీకాంత్ గురించే మాట్లాడతారని అన్నారు. అయితే చిన్న సినిమాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. అలాంటి చిత్రాల్లో తన పేరును, పోస్టర్‌ను మార్కెటింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించుకుంటారని, దీంతో ప్రేక్షకుల్లో ఆ సినిమా గురించి వేరే అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇది తాను హీరోగా నటిస్తున్న చిత్రాలపై కూడా ప్రభావం చూపించే అవకాశముందని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే ఇకపై గెస్ట్ రోల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ‘స్లమ్ డాగ్’ చిత్రంలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version