
Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4 నుంచి భారత్‌లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ స్పెషల్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇంగ్లీష్ వెర్షన్‌లో మరో ఆసక్తికరమైన మార్పు ఉంది. ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్లతో పోలిస్తే దీని రన్‌టైమ్‌ను గణనీయంగా తగ్గించారు. ఇంగ్లీష్ వెర్షన్ 176.52 నిమిషాలు.. అంటే 2 గంటల 56 నిమిషాల 52 సెకన్ల నిడివితో ఉండనుంది. మిగిలిన భాషల వెర్షన్ల రన్‌టైమ్ 194.12 నిమిషాలు.. అంటే 3 గంటల 14 నిమిషాల 12 సెకన్లు. మొత్తంగా చూస్తే ఇంగ్లీష్ వెర్షన్ దాదాపు 18 నిమిషాలు తక్కువగా ఉండనుంది.
ఇంగ్లీష్ వెర్షన్‌కు ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ‘A’ సర్టిఫికెట్ లభించింది. ఈ వెర్షన్‌ను సెప్టెంబర్ 1న సర్టిఫై చేసినట్లు తాజా సమాచారం. మరోవైపు విదేశాల్లో మాత్రం ఇంగ్లీష్ వెర్షన్ ఆగస్టు 26నే విడుదలైంది. ఇప్పుడు భారత్‌లోనూ థియేట్రికల్ రిలీజ్ కావడంతో యశ్ అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. ‘టాక్సిక్’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తాజా బాక్సాఫీస్ రిపోర్టులు వెల్లడించాయి. ఎనిమిదో రోజు నాటికి వరల్డ్‌వైడ్ కలెక్షన్ రూ.320 కోట్లకు చేరువైనట్లు సమాచారం. ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఒరిజినల్‌గా చిత్రీకరించారు. అందువల్ల ఇంగ్లీష్ వెర్షన్ కేవలం డబ్బింగ్ వెర్షన్ కాకుండా.. ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ లాంగ్వేజ్ కట్‌గా ఉండనుంది. మరి సెప్టెంబర్ 4 నుంచి ఇండియన్ థియేటర్లలో ఈ స్పెషల్ వెర్షన్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
