
TG Vishwa Prasad: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమా ఇండస్ట్రీ బిజినెస్ లెక్కలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో, దర్శకుడు గౌరి నాయుడు తెరకెక్కించిన తాజా చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఈ చిత్ర ప్రెస్మీట్లో చిత్ర బృందంతో కలిసి పాల్గొన్న టీజీ విశ్వప్రసాద్.. థియేటర్ల కేటాయింపు, పెద్ద సినిమాల పోటీ, పెయిడ్ ప్రీమియర్స్ వ్యూహంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా చాలా ప్రాక్టికల్‌గా స్పందించారు.
బాక్సాఫీస్ బరిలో ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా, మరోవైపు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు నిలబడిన నేపథ్యంలో.. థియేటర్లు దక్కడంపై అన్యాయం జరిగిందని ఏమైనా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులిచ్చారు. “సినిమా పరిశ్రమలో న్యాయాలు, అన్యాయాలు అంటూ ఏమీ ఉండవు. ఇదంతా పక్కా కామర్స్. పెద్ద సినిమాలు భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకే వస్తాయి, వాటి మార్కెట్ లెక్కలు వేరుగా ఉంటాయి. అలాగని మాది చిన్న సినిమా అని నేను ఒప్పుకోను.. ఇది చాలా మంచి సినిమా. అక్టోబర్ 17న పూర్తి ప్రణాళికతో థియేటర్లలోకి అడుగుపెడుతున్నాం. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్లో సినిమా నిలబడుతుందనే గట్టి నమ్మకం మాకుంది” అని స్పష్టం చేశారు.
సినిమా రిలీజ్‌కి ఏకంగా నాలుగు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడం పెద్ద రిస్క్ కదా అన్న ప్రశ్నకు విశ్వప్రసాద్ ఆసక్తికర వివరణ ఇచ్చారు. “ఇది ఏదో హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదు, చాలా కాన్షియస్గా ప్లాన్ చేసిన వ్యూహం. సాధారణంగా ప్రమోషన్లకు నెల రోజుల ముందే రంగంలోకి దిగుతారు. కానీ మాకు ప్రమోషన్ల కోసం రెండు వారాల కంటే తక్కువ సమయమే దొరికింది. అదే సమయంలో ఈ పండగ సీజన్‌ను ఏమాత్రం వదులుకోకూడదని అక్టోబర్ 17 రిలీజ్ డేట్‌ను లాక్ చేశాం. ఇంత తక్కువ సమయంలో సినిమాపై మాకున్న కాన్ఫిడెన్స్‌ను జనాలకు చూపించడానికి ఉన్న ఏకైక మార్గం ఎర్లీ ప్రీమియర్స్ మాత్రమే. అందుకే నాలుగు రోజుల ముందే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు. పెద్ద సినిమాల పోటీ, థియేటర్ల సమస్యలను పక్కనపెట్టి.. పూర్తిగా కంటెంట్, పాజిటివ్ మౌత్ టాక్‌నే నమ్ముకుని విశ్వప్రసాద్ చేసిన ఈ డేరింగ్ స్టెప్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.













