Site icon TeluguMirchi.com

Tamil Nadu Politics: సీఎం విజయ్ వర్సెస్ స్టాలిన్.. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో మాజీ సీఎం!

CM Vijay vs MK Stalin

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది. సీఎం, టీవీకే అధినేత విజయ్ రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి డీఎంకే (DMK) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆయన ఇప్పుడు ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే వార్త తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవలే అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి.. “మీ నాన్న (ఎం.కె. స్టాలిన్) ఎక్కడ? సభలో కనిపించడం లేదు” అంటూ పరోక్షంగా సెటైర్ వేశారు. గత ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు డీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అదే సమయంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడానికి, అధికార పక్షానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి తన అవసరం ఎంతైనా ఉందని స్టాలిన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సీనియర్ నేత కేఎన్ నెహ్రూ సైతం స్టాలిన్ త్వరలోనే అసెంబ్లీకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు.

రెండు స్థానాల్లో గెలిచిన సీఎం విజయ్.. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ స్థానం ఖాళీ అయ్యింది. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల సాయం లేకుండా డీఎంకే ఒంటరిగా బరిలోకి దిగడానికి వ్యూహాలు రచిస్తోందట. ఈ ఐదు స్థానాల్లో ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ నుంచి ఎం.కె.స్టాలిన్‌ను బరిలోకి దించడం ద్వారా అటు కేడర్‌లో జోష్ నింపడంతో పాటు, సీఎం విజయ్ విసిరిన సవాల్‌కు క్షేత్రస్థాయిలోనే సమాధానం చెప్పవచ్చని డీఎంకే భావిస్తోందని చెబుతున్నారు. ఒకవేళ స్టాలిన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. ఈ ఉప ఎన్నిక ఫైట్ నెక్ టూ నెక్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version