Saroja Devi : సినీ లోకానికి తీరని లోటు.. ప్రముఖ నటి బి. సరోజాదేవి కన్నుమూత

Saroja devi passes away

Saroja Devi : సినిమా ఇండస్ట్రీలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటి బి. సరోజాదేవి (87) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

బి. సరోజాదేవి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించి, అన్ని భాషల ప్రేక్షకుల మన్ననలు పొందారు. తెలుగు సినిమాల్లో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సీనియర్ హీరోల సరసన అద్భుతమైన సినిమాల్లో నటించారు.

1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి, తన సినీ ప్రయాణాన్ని కన్నడ చిత్రం మహాకవి కాళిదాసు (1955)తో ప్రారంభించారు. ఇది జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇందులో ఆమె సహాయ పాత్రలో నటించినా, ఆమెకు తొలి గుర్తింపు ఇక్కడినుండే వచ్చింది. తెలుగులో ఆమె తొలి చిత్రం పాండురంగ మహత్యం (1957), ఇందులో ఎన్టీఆర్ సరసన నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి కృష్ణ కుమారి డబ్బింగ్ చెప్పారు. అనంతరం సరోజాదేవి స్వయంగా డబ్బింగ్ చెబుతూ సీతారామ కళ్యాణం, ఆత్మబలం, పెళ్లి కనుక వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం “కలైమாமణి” అవార్డును ప్రదానం చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవల పట్ల గౌరవంగా 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్యకళాధర, 2007లో రోటరీ శివాజీ అవార్డు, అలాగే ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (సౌత్) కూడా అందుకున్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇంకా 1998, 2005 సంవత్సరాల్లో 45వ , 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె పేరుతో భారతీయ విద్యాభవన్ 2010లో “పద్మభూషణ్ బి. సరోజాదేవి నేషనల్ అవార్డు”ని ప్రారంభించింది, ఇది ప్రదర్శన కళలలో కృషి చేసిన కళాకారులను గౌరవించే జీవిత సాఫల్య పురస్కారంగా కొనసాగుతోంది.

బి. సరోజాదేవి అద్భుతమైన నటనతో, నాణ్యమైన విలువలతో కూడిన జీవితంతో ఎన్నో తరాల ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా నిలిచింది.