
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తాను ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాననే విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా అన్నాడు. ఇది తన వ్యక్తిగత అంశమని చెప్పాడు. తనకు, సీఎస్కే ఫ్రాంఛైజీ యాజమాన్యానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నాడు. తన కుటుంబం కోసం తాను వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పాడు. సీఎస్కే కూడా తనకు మరో కుటుంబం వంటిదని… ధోనీ భాయ్ తనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని తెలిపాడు. వెనక్కి రావాలని తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదని అన్నాడు.
ఐపీఎల్ కోసం క్వారంటైన్ సమయంలో కూడా తాను ప్రాక్టీస్ చేశానని.. యూఏఈలో తనను మళ్లీ చూసే అవకాశం ఉందని రైనా చెప్పాడు. రైనా అర్థాంతరంగా ఇండియాకు వచ్చిన వెంటనే… అతనికి, సీఎస్కే యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. దీనిపై రైనా స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. తన గురించి శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ… కొడుకుని తండ్రి మందలించడం సాధారణ విషయమని చెప్పాడు.
