ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు టీకా తయారీ సంస్థలు కృషిచేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా తయారుచేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ 4కోట్ల డోసులను తయారుచేసి సిద్ధంగా ఉంచినట్లు భారత్‌కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
అయితే, ప్రస్తుతం తయారుచేసిన 4కోట్ల వ్యాక్సిన్ డోసులు భారత్‌లో సరఫరా చేయడానికేనా? అన్న ప్రశ్నకు మాత్రం సీరం ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం, ఈ టీకా తుది ప్రయోగాలను సీరంతో పాటు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కలిసి నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 15చోట్ల ప్రయోగాలను కొనసాగిస్తున్నాయి.
