
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్ 19 పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కర్నూలు జిల్లాలో 26, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది.
కాగ రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.
