
రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుల్లో ఒకరు.. జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి తనపై, తన భార్యపై గూండాలు దాడి చేశారని ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. గోస్వామిపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. విధులు ముగించుకొని కారులో తన సతీమణి సమ్యబ్రత రాయ్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఎన్‌ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అర్నాబ్ పేర్కొన్నారు.
ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఏం కాలేదు. గురువారం ఉదయం ఓ వీడియో విడుదల చేసిన ఆయన తనపై దాడి జరిగిందని వెల్లడించారు. విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి తమ మీద దాడి చేశారని చెప్పారు. తొలుత తన కారు అద్దాలను పగులగొట్టాలని చూశారని, అది వీలు కాకపోవడంతో ఏదో ద్రావణం కలిగిన బాటిల్స్‌ను కారుపైకి విసిరారని చెప్పారు.
