
కరోనా నుంచి రక్షణ కోసం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా మందు ఆశలు రేపుతోంది. కోతులపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ప్రాణాంతక వైరస్‌ను కోతుల్లోని రోగనిరోధక శక్తి అడ్డుకుందని పరిశోధకులు తెలిపారు. ప్రతికూల ప్రభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు.
ఒక వ్యాక్సిన్ డోసే ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాలపై వైరస్ తీవ్రత తగ్గించిందని పరిశోధకులు తెలిపారు. ‘ కోతులకు మేం ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చాం. మిగతా కోతులతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వాటిలో ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గడం, శ్వాసనాళంలోని కణజాలం వైరస్‌ను అడ్డుకోవడాన్ని మేం గమనించాం. ’ అని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు తెలిపారు.
