
కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనికి తగిన ఆధారాలు తమ వద్ద ప్రపంచ ఆరోగ్య సంస్థ కు 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు లేఖ రాసిన విషయం తెలిసిందే. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై ఈ మేరకు సిఫార్సులను సవరించాలని వారు కోరారు. తాజాగా ఈ లేఖపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనను కొట్టిపారేయలేమని పరిశోధకుల వాదనకు మద్దతు పలికింది.
దీనికి సంబంధించి తాజాగా వెలువడుతున్న ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు ‘తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ముక్కు లేదా నోటి నుంచి వెలువడే తుంపర్లు ఇతరుల మీద పడితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలని, అదేవిధంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే.
