
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు అనుగుణంగానే ఇవాళ కేవలం 6 కేసులే వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. ఇవాళ ఒక్క మరణం కూడా సంభవించలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. నేడు 22 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 464కి పెరిగింది. ఇక 552 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున ఈ చర్య తీసుకుంది. సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలు వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని ప్రకటించింది.