
గాంధీ ఆస్పత్రి పేరు మారింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి కొవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేసినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 13 కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 663కు చేరిందని, బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్ పై ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 291 అని వివరించిన ఈటల, ఈరోజు ‘కరోనా’ మరణాలు లేవని తెలిపారు.
సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాల ద్వారా 265 మందికి, వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకినట్టు వివరించారు.