Site icon TeluguMirchi.com

రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల అరాచకం.. తిరుగుబాటు చేస్తున్న ప్రజలు

Polavaram canal soil
రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా శృతిమించుతోంది. కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ, పుష్కర కాల్వ పనులు శరవేగంగా సాగుతుండగా, స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు రోజుకు వందల లారీలతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఈ ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్థరాత్రి లారీలను అడ్డుకుని, మట్టి మాఫియాపై తిరుగుబాటు చేయడంతో ఈ వార్త రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో కాల్వలు ఆక్రమించినా, నీళ్లు వెళ్లే మార్గాన్ని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించినప్పటికీ, సాక్షాత్తూ ఆయన పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే సారథ్యంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. కాలువ పునాదులనే తవ్వి మట్టిని తరలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

రోజుకు 100 లారీల పైగా నిరంతరం తిరుగుతున్నా, అడిగేవాడు, ఆపేవాడు లేడని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తేలు కుట్టిన దొంగల్లా అందరూ గమ్మున ఉంటున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక అత్యవసర రోగిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుంటే, ఈ మట్టి లారీల వల్ల రెండు గంటలు ఆలస్యం కావడంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ మట్టి తవ్వకాల వల్ల కాలువ గట్లు బలహీనపడి, భవిష్యత్తులో నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజలందరూ ఏకమై ఈ తిరుగుబాటుకు దిగారు. మట్టి మాఫియా ఆగడాలపై వార్తలు వెలువడటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అయ్యారు. ఈ ఘటనపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూస్తామని, అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మంచి ప్రభుత్వమని ఓట్లేసి గెలిపిస్తే, ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని నెట్టింట్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version