Site icon TeluguMirchi.com

ఐపీఎల్ 2020 విజేతగా ముంబై

ఐపీఎల్ 2020 సీజన్ విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో అలవోక ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. ఢిల్లీ ఇచ్చిన 157 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించి రియల్ ఛాంపియన్స్ అనిపించుకుంది. ఐదోసారి టైటిల్‌ని కైవసం చేసుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారికాగా.. ఆరోసారి ఫైనల్‌కి చేరిన ముంబయి.. ఐదోసారి కప్‌ని ముద్దాడటం గమనార్హం.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలిబంతికే షాక్ తగిలింది. సూపర్ ఫాంలో ఉన్న మార్కస్ స్టోయినిస్(0) తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. బౌల్ట్ బౌలింగ్‌లో మొదటి బంతికే కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత రహనే(2), ధవన్(15) కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్(65) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు రిషబ్ పంత్(56) చక్కటి స్ట్రోక్ ప్లే తోడవడంతో స్కోరు బోర్డు కాస్త పెరిగింది. కానీ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే పంత్ అవుటవడం, ఆ తరువాత వచ్చిన షిమ్రన్ హెట్‌మెయిర్(5) అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 156 మాత్రమే ముంబై ముందు ఉంచగలిగింది.

టార్గెట్ ఛేదనకు దిగిన ముంబై మెరుపు వేగంతో దిగింది. డికాక్ (20/ 12 బంతుల్లో, మూడు 4, నాలుగు 6), రోహిత్ ముందు నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే అయిదో ఓవర్‌లో డికాక్‌ను స్టాయినిస్‌ బోల్తాకొట్టించాడు. కాగా, ఫస్ట్ ‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో ముంబై పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్‌ స్పిన్నర్లకు బంతి అందించడంతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసర పరుగుకు రోహిత్‌ ప్రయత్నించగా.. సూర్యకుమార్ కెప్టెన్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ముంబై విజయం దిశగా సాగింది.

Exit mobile version