Site icon TeluguMirchi.com

Archery Premier League 2025 : భారత ఆర్చరీకి గ్లోబల్ గుర్తింపు.. బ్రాండ్ అంబాసడర్‌గా రామ్‌చరణ్

Ramcharan
Archery Premier League 2025 : భారత్‌లో తొలిసారిగా నిర్వహించబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసడర్‌గా నియమితులయ్యారు. ఈమేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (AAI) గురువారం న్యూఢిల్లీ లో అధికారిక ప్రకటన చేసింది. ఈ టోర్నీ అక్టోబర్ 2 నుంచి 12 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరగనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్నొన్నారు.

ఫ్రాంచైజీ ఆధారంగా జరుగుతున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పాల్గొననున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీపడనున్నారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ఆర్చరీ క్రీడలో క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకత వంటి విలువలు నన్ను ఆకర్షించాయి. ఈ లీగ్ ద్వారా భారత ఆర్చర్లకు గ్లోబల్ వేదిక దొరుకుతుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవడం నాకు గర్వంగా ఉంది” అని అన్నారు.

AAI అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ, “ఏపీఎల్‌ గ్రామీణ ప్రతిభావంతుల ఆర్చర్లకు పెద్ద వేదిక అవుతుంది. రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసడర్‌గా ఉండటం వల్ల యువతలో ఆర్చరీపై ఆసక్తి మరింత పెరుగుతుంది” అన్నారు. అలాగే AAI ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవా, “ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, భారత ఒలింపిక్ కలను నిజం చేసుకునే దిశగా ఒక పెద్ద అడుగు” అని పేర్కొన్నారు.

Exit mobile version