‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఓటీటీ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడాలంటే ?

Proddutur
దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకలు కళాత్మకత, భక్తిశ్రద్ధలతో నిండిపోతూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ఈ అద్భుతమైన ఉత్సవాల వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన డాక్యుమెంటరీ “ప్రొద్దుటూరు దసరా” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల నిర్మించిన ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 31న విడుదలై మంచి స్పందనను పొందింది. దసరా సంబరాలు, ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి — అన్నింటినీ 40 నిమిషాల నిడివిలో అందంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ETV Winలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. టెక్నికల్‌ పరంగా చాలా క్వాలిటీగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో ప్రొద్దుటూరులో దసరా సమయంలో కనిపించే వైభవం, భక్తి, ప్రజల ఆనందాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు. కొత్త టీమ్‌ అయినప్పటికీ అనుభవజ్ఞుల్లా ఈ ప్రాజెక్ట్‌ను మలిచారు. స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్‌ బాధ్యతలు చేపట్టగా, కిలారి సుబ్బారావు PROగా వ్యవహరించారు. మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఇలాంటి డాక్యుమెంటరీలు తెలుగు కల్చర్‌కి నిలువుటద్దంగా నిలుస్తాయని టీమ్ చెబుతోంది.