
Vanda Devullu: తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బిచ్చగాడు’ తర్వాత దాదాపు పదేళ్లకు తెరకెక్కిన ప్రాజెక్ట్ కావడం విశేషం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా తల్లి, కొడుకు మధ్య ఉండే అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోని, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
‘వంద దేవుళ్లు’ కథ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన తర్వాత తన పిల్లలను పెంచి పెద్ద చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన ఓ తల్లి సెల్వి ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక తన జీవితంలో కూడా ఓ తోడు కావాలని కోరుకునే సమయంలో ఆమె ఎదుర్కొనే సామాజిక సవాళ్లు, సంప్రదాయ ఆలోచనలు, కుటుంబ పరిస్థితుల చుట్టూ కథ సాగుతుంది. సాధారణంగా తల్లి త్యాగాలను మాత్రమే చూపించే కథలకు భిన్నంగా.. తన తల్లి ఆనందం, సంతోషం కోసం ఆమె నిర్ణయాలకు అండగా నిలిచే కొడుకు పాత్రను ఈ సినిమాలో చూపించారు. మాతృత్వం, ప్రేమ, గౌరవం, మహిళల స్వేచ్ఛ, సామాజిక సమస్యలు వంటి అంశాలను భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కథనం, నటీనటుల న్యాచురల్ యాక్టింగ్, సున్నితమైన సామాజిక అంశాలను చూపించిన విధానంపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మొత్తంగా.. భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘వంద దేవుళ్లు’ ఓటీటీ వేదికగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది.
