
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ హీరో రాగ్ మయూర్ కలయికలో తెరకెక్కిన ఫన్నీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’. కామెడీ, మిస్టరీ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
వైజాగ్‌కు చెందిన సన్నీ (రాగ్ మయూర్) ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ, అనుమానిస్తూ ఉంటాడు. ఇదే స్వభావంతో ‘అనుమాన పక్షి’ అనే ఛానెల్‌ను కూడా నడుపుతుంటాడు. ఇదిలా ఉంటే కాశ్మీర్‌లో ఉన్న అతని స్నేహితుడు అనంత్ (చరిత్) తనకు ఏదో జరిగిపోతుందంటూ ఫోన్ చేయడంతో సన్నీ తన స్నేహితులతో కలిసి అక్కడికి బయలుదేరుతాడు.
ఈ ప్రయాణంలో సన్నీకి కన్యా కుమారి (మెరిన్ ఫిలిప్) పరిచయం అవుతుంది. మరోవైపు అతని స్నేహితుడు వర్మ (ప్రిన్స్) అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. ఆ మరణానికి తానే కారణమేమోనని సన్నీ అనుమానించడం మొదలుపెడతాడు. పోలీసుల ఎంట్రీ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్
యంగ్ హీరో రాగ్ మయూర్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సన్నీ పాత్రలో అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొన్ని సన్నివేశాల్లో మంచి ఫన్‌ను పంచుతాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్‌లోని అనుమానించే స్వభావం కొన్ని సందర్భాల్లో నవ్విస్తుంది.
కథలో కామెడీ, మిస్టరీని కలిపే ప్రయత్నం కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేస్తాయి.
మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ సినిమా రెండు గంటల లోపే ఉండటం. కథనంలో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినప్పటికీ తక్కువ రన్‌టైమ్ కారణంగా సినిమా మరీ భారంగా అనిపించదు.
మైనస్ పాయింట్స్
‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ స్థాయి కామెడీ మ్యాజిక్‌ను ‘అనుమాన పక్షి’ పూర్తిగా అందుకోలేకపోయింది.
కథలో మంచి కామెడీకి, క్యారెక్టరైజేషన్‌కు అవకాశం ఉన్నప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. కొన్ని సన్నివేశాలు సహజంగా అనిపించకుండా, కథలో బలవంతంగా చేర్చినట్టుగా అనిపిస్తాయి.
క్విర్కీ కామెడీని చూపించే ప్రయత్నం కనిపించినా, అన్ని సందర్భాల్లో అది వర్కవుట్ కాలేదు. ఫలితంగా కొన్ని సీన్స్ నవ్వించడానికి బదులుగా కాస్త గందరగోళంగా అనిపిస్తాయి.
హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, అలాగే రాశి, అజయ్, బ్రహ్మాజీ వంటి నటీనటులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకపోవడం కూడా మైనస్‌గా నిలుస్తాయి.
సాంకేతిక వర్గం
నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్లస్. సునీల్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ఓకే.
దర్శకుడు విమల్ కృష్ణ విషయానికి వస్తే.. కథలోని కామెడీ పొటెన్షియల్‌ను పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. రైటింగ్, కామెడీ ఎపిసోడ్స్‌లో మరింత పకడ్బందీగా ఉంటే సినిమా మరింత బాగా వర్కవుట్ అయ్యేది.
తీర్పు
మొత్తంగా ‘అనుమాన పక్షి’ మంచి కామెడీ ప్రయత్నంగా నిలుస్తుంది. రాగ్ మయూర్ కామెడీ టైమింగ్, కొన్ని ఫన్ సీన్స్, తక్కువ రన్‌టైమ్ సినిమాకు ప్రధాన బలాలు. అయితే కథనం, స్క్రీన్‌ప్లేలో మరింత పట్టు ఉండి, కామెడీని ఇంకాస్త సహజంగా పండించి ఉంటే సినిమా మరింత మెప్పించేది.
డీజే టిల్లు స్థాయి మ్యాజిక్‌ను ఆశించకుండా, లైట్‌గా కామెడీ–మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా చూస్తే ‘అనుమాన పక్షి’ ఓకే అనిపిస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5









