Site icon TeluguMirchi.com

రివ్యూ : హరి హర వీరమల్లు

Hhvm review
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5

హరి హర వీరమల్లు – వజ్రం కోసం కాదు… ధర్మం కోసం యుద్ధం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ ఎన్నో అడ్డంకులు, వాయిదాలు ఎదుర్కొని చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా రెండు కరోనా వేవ్స్, పవన్ రాజకీయ వ్యస్థతలు వంటి కారణాలతో ఆలస్యం అయ్యింది. చివరికి దర్శకుడిగా జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టి చిత్రాన్ని పూర్తి చేశారు. విడుదలకు ముందు పెద్దగా బజ్ లేకపోయినా, పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో పాల్గొన్న క్షణం నుంచి సినిమాపై ఆసక్తి పెరిగింది. రెండు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రంలోని మొదటి భాగం తాజాగా ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందని తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాలి.

కథ:

1650లో మొగలుల ఆధిపత్యంలో భారతదేశం నలుగుతున్న కాలంలో, ఔరంగజేబు తన మతాన్ని విస్తరించేందుకు నరమేధం సాగిస్తుండే రోజులు. ఆ సమయంలో విలువైన కోహినూర్ వజ్రం అతని చేతిలోకి వెళ్తుంది. ఔరంగజేబ్ ఉద్దేశ్యం స్పష్టంగా ఒకటే — భారతదేశమంతా తన మతంలోకి మారితేనే బ్రతుకు, లేదంటే చావే. అయితే, ఈ వజ్రాన్ని దొంగిలించే తలపోస్తేనే భయపడే రోజుల్లో, ఈ కార్యాన్ని సాహసంగా చేయగలిగే ధైర్యవంతుడు హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్). గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా (దలీప్ తహిల్) అతన్ని పిలిపించి, కోహినూర్‌ను ఔరంగజేబ్ నుంచి దొంగిలించే బాధ్యతను అప్పగిస్తాడు. వీరమల్లు ఓ మంచి దొంగ — ధనవంతుల వద్ద దొంగతనం చేసి పేదలకిచ్చే రాబిన్ హుడ్‌లా ఉండే ఇతను, బందరు పోర్టులో విదేశాలకు తరలిపోతున్న సంపదను దోచుకుంటాడు.

ఈ నేపథ్యంలో కొల్లూరు సంస్థానాధిపతి అతన్ని పిలిపించి తానీషా దగ్గరకు వెళ్తున్న ఖజానాను దోచమంటాడు. అదే సమయంలో, అంతపురంలో ఉన్న పంచమిని (నిధి అగర్వాల్) చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఖజానా దొంగతనంలో పట్టుబడిన వీరమల్లును, అక్కన్న-మాదన్నల సహకారంతో ఔరంగజేబ్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొస్తే వజ్రాల గని ఇస్తామని చెప్పడంతో, అతను ఢిల్లీకి బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? ఔరంగజేబ్ రాజ్యంలో హిందువులపై ఉన్న ద్వేషానికి ఏమేరకు తగిన సమాధానం ఇచ్చాడు? చివరికి కోహినూర్‌ను వెనక్కి తీసుకొచ్చాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని థియేటర్‌లో చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమా ఆరంభంలో వరదలో తల్లిదండ్రుల నుంచి విడిపోయిన బాలుడు, బ్రాహ్మణుడైన సత్యరాజ్ కుటుంబం ద్వారా విద్యావంతుడిగా ఎదిగిన వీరమల్లు పాత్ర పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. బందరు పోర్టులో దొంగతనంతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ మాస్లతో ఆకట్టుకుంటుంది. క్రమేణ కథ కృష్ణా నది తీరం నుంచి ఢిల్లీ వరకు సాగుతుంది — కోహినూర్ వజ్రం కోసం. ఈ ప్రయాణంలో ఒకవైపు పవన్ పాత్రకు స్థాయిని తీసుకురావడమే కాకుండా, మొగలుల కాలంలో హిందువులపై జరిగిన దురాగతాలను కూడా థీమ్‌గా చూపిస్తారు. పవన్ అభిమానులకు గూస్‌బంప్స్ తెచ్చే సీన్లు, జనసైనికులని ఉల్లాసపరచే డైలాగ్స్ ఆకర్షణీయంగా నిలిచాయి. అయితే, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాకు నష్టం కలిగించాయి. ఫస్ట్ హాఫ్ తర్వాత సినిమాలో భారీ స్ధాయిలో బజ్ పెరిగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కథను తీర్చిదిద్దే విషయంలో దర్శకుడు అనుభవలోపం చూపించినట్టే అనిపిస్తుంది. దర్శకుడు క్రిష్ పూర్తిగా సినిమా రూపకల్పనలో ఉంటే ఫలితం ఇంకా గొప్పగా ఉండేదేమో అన్న అభిప్రాయం మిగులుతుంది.

సాంకేతిక వర్గం:

పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పూర్తిగా వన్ మ్యాన్ షో చేశారని చెప్పడం అతిశయోక్తి కాదు. వివిధ కాలాల్లో షూటింగ్ జరిగిన నేపథ్యంలో ఆయన లుక్స్‌లో ఉన్న మార్పులు కనిపించినా, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మ్యాజికల్. పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ఆకట్టుకోలేకపోయినా, బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో క్రూరత్వాన్ని ఒదిగించగలిగారు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు లాంటి నటులు తమ పరిధిలో బాగా నటించారు. టెక్నికల్‌గా, ఎం.ఎం.కీరవాణి సంగీతం సినిమా పటిష్టతను పెంచింది. నేపథ్య సంగీతం కొన్ని సీన్లను నిలబెట్టింది. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, ఫైట్స్, సినిమాటోగ్రఫీ మంచిగా ఉన్నా, వీఎఫ్ఎక్స్ పెద్ద మైనస్. కొన్ని కీలక సన్నివేశాల్లో విజువల్స్ తక్కువ స్థాయిలో ఉండటం సినిమా రేంజ్ తగ్గించింది. అయితే, చివర్లో సీక్రెట్‌గా కొనసాగే సీన్స్ ద్వారానే పార్ట్ 2కి ఆసక్తికరంగా లీడ్ ఇవ్వడం మెరిసిన మలుపు. మంచి కథతో మొదలైన ఈ సినిమా, మరింత అనుభవమున్న దర్శకుని చేతిలో ఉంటే అత్యున్నతంగా నిలబడేదని అనిపిస్తుంది. అయినా, పవన్ ఫ్యాన్స్‌కు ఇది పండగే.

ఫైనల్ గా :

పవన్ అభిమానులు, మాస్ యాక్షన్ లవర్స్, పీరియాడిక్ డ్రామాల అభిమానులు ఎంజాయ్ చేయవచ్చు…
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5

Exit mobile version