రివ్యూ : ఇట్లు మీ ఎదవ | Itlu Mee Yedava Review

Itlu mee edava review
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5

‘ఇట్లు మీ ఎదవ’ చిత్రంలో త్రినాథ్ కఠారి హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటించింది. ఈ ఎదవ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో రివ్యూ లో చూద్దాం.

కథ విషయానికొస్తే, ఆరేళ్లుగా పీజీ చేస్తూ ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాథ్) కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను మెప్పించి ప్రేమలో పడేసేంతవరకు సాగిన ఈ లవ్ ట్రాక్ తర్వాత, వారి ప్రేమ ఇంట్లో తెలిసినప్పుడు మనుస్విని తండ్రి (దేవి ప్రసాద్) “అలాంటి ఎదవకు కూతురిని ఇచ్చేది లేద”ని శ్రీను తండ్రి (గోపరాజు రమణ)ని అవమానిస్తాడు. ఈ పరిస్థితే డాక్టర్ (తనికెళ్ళ భరణి) వద్దకు దారి తీస్తుంది. డాక్టర్ వేసిన ఛాలెంజ్ ప్రకారం శ్రీను 30 రోజులు మనుస్విని తండ్రితో ఉండాలి, ఆ సమయంలో అతను నిజంగా ఎదవేనా లేక మారతాడా అన్నది ఆధారంగా ఈ ప్రేమ సాగుతుందా లేదా అన్నది కథలో ప్రధానాంశం.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

సినిమాలో బొమ్మరిల్లు కాన్సెప్ట్ రివర్స్ చేసినట్టుగా ఈ కథ నడుస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ లవ్ సీన్లు, కాలేజీ ట్రాక్ వల్ల బోర్ కొట్టిస్తుంది. కొన్ని సీన్లు కేవలం అతికించినట్టుగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ దగ్గర 30 రోజుల ఛాలెంజ్ కథను ఆసక్తికరంగా మార్చుతుంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం కథ మొత్తం హీరో–హీరోయిన్ తండ్రి చుట్టూనే తిరుగుతూ, కొన్ని అవసరం లేని సీన్లు కూడా కనిపిస్తాయి. కామెడీ ట్రై చేసినా ఎక్కువగా పని చేయలేదు. అయినప్పటికీ క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా బాగా రాసుకున్నారు. కథను మొత్తం నడిపించిన లైన్‌కు భిన్నంగా, భావోద్వేగం కలిపి అందించిన ఈ క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా హీరో పాత్రను మొదట్నుంచి చివరి వరకు ఎదవగా చూపించినప్పటికీ ‘ఎదవలా కనిపించే వాళ్లంతా ఎదవలు కాదు’ అనే సందేశాన్ని చెప్పాలనే దర్శకుడి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటుల విషయానికి వస్తే, త్రినాథ్ కఠారి హీరోగా, దర్శకునిగా రెండింటినీ సమతూకంగా మేనేజ్ చేశారు. సాహితీ అవాంచ చబ్బీ లుక్‌తో, అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. గోపరాజు రమణ మరియు దేవి ప్రసాద్ తండ్రి పాత్రల్లో న్యాయం చేశారు. తనికెళ్ళ భరణి చిన్న పాత్రలో కనిపించినా తనదైన స్టైల్‌తో సెట్ అయ్యారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ బీచ్ సీన్స్, పాటల విజువల్స్‌లో బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

మొత్తానికి ‘ఇట్లు మీ ఎదవ’ బొమ్మరిల్లు కాన్సెప్ట్‌ను రివర్స్ చేసి చెప్పిన ఓ లవ్ స్టోరీ. రొటీన్ సీన్ల మధ్యలో మంచి క్లైమాక్స్‌తో ఓసారి టైమ్ పాస్ కోసం చూడదగ్గ సినిమా.

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5