రివ్యూ : కింగ్డమ్

Kingdom

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్‌కు మళ్లీ ఊపొచ్చే సినిమా ఇదే అవుతుందన్న నమ్మకంతో విజయ్ పట్టు వదలకుండా ముందుకు వెళ్లాడు. ‘జెర్సీ’ వంటి సినిమాతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచీ మంచి అంచనాలున్నాయి. నిర్మాత నాగవంశీ భారీగా హైప్ క్రియేట్ చేయగా, టీజర్‌, ట్రైలర్‌లూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. విజయ్, గౌతమ్, నాగవంశీ ముగ్గురికీ ఇప్పుడు ఒక హిట్ అవసరమైన సమయంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకుల అంచనాలు నెరవేరాయా అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం..

కథ : సూరి (విజయ్ దేవరకొండ) హైదరాబాదులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, చిన్ననాటి నుండి కనిపించకుండా పోయిన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిణామాల మధ్య శివ శ్రీలంక జాఫ్నాలో స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా మారినట్టు తెలిసిన సూరి, అతన్ని వెనక్కి తీసుకురావాలని నిశ్చయిస్తాడు. అండర్‌కవర్ ఏజెంట్‌గా శ్రీలంక చేరిన సూరికి అక్కడ అనేక సవాళ్లు ఎదురవుతాయి — శివను దారిలోకి తీసుకురావాలన్న లక్ష్యం, దేశానికి ముప్పుగా మారే కుట్రను తిప్పికొట్టడం, స్థానిక తెలుగు కుటుంబాలకు అండగా నిలబడడం, ఇంకా శ్రీకాకుళం నేపథ్యం వంటి అనేక మలుపులు కథను ఆసక్తికరంగా మార్చుతాయి. సూరి మిషన్ విజయం సాధించాడా? అన్నయ్యను కలిశాడా? అనేదంతా థియేటర్లలో తెలుసుకోవాల్సిందే.

Also Read :  YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

విశ్లేషణ : కథ ప్రారంభం నుంచే పీరియాడిక్ డ్రామా మూడ్‌ను తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. శ్రీకాకుళం తీరంలో 110 ఏళ్ల క్రితం మొదలైన ఈ కథ శ్రీలంకలో కొనసాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంతో ఈ కథ శ్రీలంక, హైదరాబాద్ మధ్య తిరుగుతూ మళ్లీ శ్రీలంక చేరుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్‌తో సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో కొంత స్థిరత్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల కథను ఇప్పటికే చూసినట్టు అనిపించే తాలూకులు కనిపిస్తాయి. “యుగానికి ఒక్కడు” లాంటి సినిమాల ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది. అయినప్పటికీ, నటీనటుల పర్ఫామెన్స్ సినిమాను నిలబెట్టడానికి సహాయపడింది.

విజయ్ దేవరకొండ పాత్రలో నిఖార్సైన నటన ప్రదర్శించాడు. కానిస్టేబుల్‌గా మొదలై, తర్వాత కథలో మలుపుల్ని ఎదుర్కొన్న అతని పాత్ర చాలా ఆసక్తికరంగా తయారైంది. సత్యదేవ్ నటన కూడా బాగుంది. వెంకటేష్ అనే కొత్త నటుడు కూడా ఆకట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే పాత్ర చిన్నదే అయినా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశం లేదు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు గౌతమ్ ఫస్ట్ హాఫ్‌ను రిచ్‌గా తీర్చిదిద్దాడు. అయితే సెకండ్ హాఫ్ రైటింగ్ మరింత పక్కాగా ఉండివుంటే సినిమా ఇంకొంత బలంగా ఉండేది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, కొన్ని ఫ్రేములు సినిమాకి అదనపు వన్నె తెచ్చాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ ఉన్నా, బాగా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఎమోషనల్‌గా మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే “కింగ్డమ్” ఒక టెక్నికల్‌గా రిచ్ సినిమా. అయితే ఎమోషనల్‌గా మరింత బలంగా ఉండి ఉంటే, ఇది మరింత మెప్పించే సినిమా అయ్యేదనడంలో సందేహం లేదు.

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5