Nari Nari Naduma Murari Review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
శర్వానంద్‌కు ఒక సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమాపై మొదటినుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించిందో, ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ: ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్) అదే ఆఫీసులో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. పెళ్లి వరకు వెళ్లిన ఈ ప్రేమకు అనుకోకుండా గౌతమ్ పాత ప్రేమ కథ అడ్డంకిగా మారుతుంది. కాలేజీ రోజుల్లో దియా (సంయుక్త మీనన్)తో గౌతమ్ చేసిన రిజిస్టర్ మ్యారేజ్ విషయం బయటపడటంతో సమస్యలు మొదలవుతాయి. మరోవైపు గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేష్) 60 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా గౌతమ్ పెళ్లికి ఆటంకంగా మారుతుంది. చివరకు గౌతమ్ – నిత్య పెళ్లి జరుగుతుందా? దియా ఎంట్రీతో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘సామజవరగమన’తో కాంప్లెక్స్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్‌ను కామెడీగా చూపించిన రామ్ అబ్బరాజు, ఈ సినిమాతో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. సీరియస్‌గా మారే అవకాశం ఉన్న కథను పూర్తిగా లైట్ టోన్‌లో, హిలేరియస్ కామెడీతో చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీస్, ఫ్లాష్ బ్యాక్‌లు, ఫ్యామిలీ కామెడీతో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌కి సంయుక్త ఎంట్రీతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే గౌతమ్ పరిస్థితిని కామెడీగా చూపిస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తారు. క్లైమాక్స్‌లో చిన్న ఎమోషన్ టచ్ ఇచ్చి సినిమాను చక్కగా ముగించారు.
నటీనటుల ప్రదర్శన: శర్వానంద్ ఈ తరహా పాత్రల్లో ఎంత కంఫర్ట్‌గా ఉంటాడో మరోసారి ప్రూవ్ చేశాడు. పెళ్లి కోసం నలిగిపోయే గౌతమ్ పాత్రలో సహజంగా నటించాడు. సాక్షి వైద్య క్యూట్ లుక్‌తో పాటు పద్ధతిగా నటించి మెప్పించింది. సంయుక్త మీనన్ ఫ్లాష్ బ్యాక్, రీ ఎంట్రీ రెండింట్లోనూ బాగానే చేసింది. అయితే ఈ సినిమాకు అసలైన హైలైట్ మాత్రం సీనియర్ నటుడు నరేష్. ఆయన పాత్ర లేకుండా ఈ సినిమా ఊహించలేం. కొన్ని సీన్స్‌లో ఆయన చేసిన కామెడీకి థియేటర్‌లో నవ్వులే నవ్వులు. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. శ్రీవిష్ణు గెస్ట్ అప్పీరెన్స్ సినిమాకు మంచి ఎండింగ్ ఇచ్చింది.
సాంకేతిక అంశాలు: సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు వినడానికి బాగున్నప్పటికీ, కొన్ని చోట్ల ప్లేస్‌మెంట్ ఇంకా మెరుగ్గా ఉండేదేమో అనిపిస్తుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు కూడా పండక్కి వచ్చే సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా: నారీ నారీ నడుమ మురారి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పండక్కి కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి నవ్వుకోవాలనుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. హిలేరియస్ కామెడీతో పాటు చిన్న మెసేజ్ కూడా చెప్పే ప్రయత్నం చేసింది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
