
ఐపీఎల్ చరిత్రలోనే ఒక పెను సంచలనంగా మారిన బీహార్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, తన అసాధారణ హిట్టింగ్‌తో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్ కిడ్‌ని.. 2024 నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ బుడ్డోడిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక్కడి నుంచే రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టి, లీగ్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన వైభవ్, ఒకే సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. దీని ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ప్రతిష్టాత్మకమైన ఆరెంజ్ క్యాప్ అందుకున్న బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండానే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన తన సహచర ఆటగాడు యశస్వి జైస్వాల్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇది పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో నమోదైన సెంచరీగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే ఒక భారతీయ బ్యాటర్ సాధించిన అత్యంత వేగవంతమైన ఐపీఎల్ శతకంగా కూడా నిలిచింది. కేవలం 440 బంతుల్లోనే 1,000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అందుకొని, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన వెస్టిండీస్ వీరుడు ఆండ్రీ రస్సెల్ రికార్డును సైతం అధిగమించాడు.
సిక్సర్ల వేటలోనూ వైభవ్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లలో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది, 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డును చెరిపేసాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. పవర్‌ప్లే ఓవర్లలోనే అత్యంత వేగంగా 521 పరుగులు రాబట్టి, గతంలో డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. మొత్తంగా 230కి పైగా అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో సాగిన వైభవ్ సూర్యవంశీ ఆట తీరు క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది.










