
గత ఏడాది డిసెంబర్లో విడుదలై కన్నడనాట సంచలనం సృష్టించిన చిత్రం కేజీఎఫ్. కన్నడలోనే కాదు పలుభాషలలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ కారణంగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు భారీ ధర పలికిందని అంటున్నారు. సుమారు రూ.55 కోట్ల డీల్ కుదిరిందట. ఈ డీల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల్లో కలుపుకుని రూ.55 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.
ఈ చిత్రాన్ని హోమబుల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తెలుగులో వారాహి చలనచిత్రం సంస్థ విడుదల చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. అధీరగా ఆయన కనిపించనున్నారు. అలాగే, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, నాజర్, సింహా, అచ్యుత్, వశిష్ట, రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.









