
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను దర్శకుడు వి.వి.వినాయక్, నటి పూనమ్ కౌర్ స్వీకరించారు.
హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-19 తరవాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. చాలా రోజుల తరవాత ఇంత మంది జనాలను చూస్తున్నాను. భయపడుతున్నా కానీ చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
