మొక్కలు నాటిన పూనమ్ ..వినాయక్

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను దర్శకుడు వి.వి.వినాయక్, నటి పూనమ్ కౌర్ స్వీకరించారు.

హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-19 తరవాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. చాలా రోజుల తరవాత ఇంత మంది జనాలను చూస్తున్నాను. భయపడుతున్నా కానీ చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.