
Accident Insurance: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన సంఘాల నాయకుల కోసం ఉచిత ప్రమాద బీమా (Accident Insurance) స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి అభిమాన సంఘాల సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పించనుండగా, జిల్లా స్థాయి అభిమాన సంఘాల సభ్యులకు రూ.3 లక్షల బీమా కవరేజీ అందించనున్నారు.
మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన సుమారు 1,000 మంది అభిమాన సంఘాల నాయకులు ఈ బీమా పథకం పరిధిలోకి రానున్నారు. అభిమానుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్‌లో ఐకాన్ స్టార్ పాల్గొని తన అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు, అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అభిమానుల ఐక్యత, సేవాభావమే తమకు నిజమైన గుర్తింపునిస్తుందని ఆయన పేర్కొన్నారు.













