ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన కరోనా పేషేంట్

ఆర్టీసీ బస్సును కరోనా పేషేంట్ ఎత్తుకెళ్ళడం సత్తుపల్లి లో వైరల్ గా మారింది. ఖమ్మం నగరానికి చెందిన శీలం మల్లయ్య సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఎక్స్‌ప్రెస్‌ బస్సును అద్దెకు నడుపుతున్నారు. గురువారం రాత్రి బస్టాండ్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సు శుక్రవారం ఉదయానికి కనిపించలేదు. దీనిపై బస్సు యజమానికి సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సును తల్లాడకు చెందిన సత్యనారాయణ అనే లారీ డ్రైవర్ ఎత్తుకుపోయినట్లు గుర్తించారు.

చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో బస్సుతో పాటు నిందితుడిని పట్టుకుని సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే నిందితుడు సత్యనారాయణ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అతడిని వెంటనే సత్తుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. సాధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన పట్ల పోలీసులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.