Site icon TeluguMirchi.com

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కబ్జా ఆరోపణలు.. టాలీవుడ్ నిర్మాతలపై కేసు నమోదు!

Jubilee Hills

Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న స్థలంలో అక్రమంగా ప్రవేశించి కబ్జాకు ప్రయత్నించారనే ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాతలు సి.కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నంబర్ 89 విషయంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి తాళాలు, గేట్లు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ మేరకు వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. స్థలానికి సంబంధించిన పత్రాలు, కోర్టు ఉత్తర్వులు, జరిగిన ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూ వివాదాలు తరచూ చర్చకు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Exit mobile version