Mokshagna Debut: కూన కాదు.. ఇక సింహమే! మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మైత్రీ పవర్‌ఫుల్ అనౌన్స్‌మెంట్..

Mokshagna

Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రంపై తాజాగా ఆయన పుట్టిన రోజున అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా పవర్‌ఫుల్ అనౌన్స్‌మెంట్‌ చేసింది. ‘‘గుహలోంచి బయటకొచ్చిన కూన.. ఇప్పుడు అడవిలోకి సింహంగా అడుగుపెడుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞ ఎంట్రీని అఫీషియల్‌గా ప్రకటించింది. మోక్షజ్ఞ తొలి సినిమాకు‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనుంది. ‘Moksh XVassishta’ పేరుతో ప్రాజెక్ట్‌కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘ది కబ్ హాస్ లెఫ్ట్ ది డెన్. నౌ, ఎంటర్స్ ది వైల్డ్ యాజ్ ఎ లయన్’’ అంటూ మోక్షజ్ఞను సింహంతో పోలుస్తూ చేసిన ఈ ప్రకటన నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీకి తండ్రి, నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు అందించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. బాలకృష్ణ × మోక్షజ్ఞ × వశిష్ట × మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోక్షజ్ఞ ఎలాంటి కథతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? వశిష్ట తనదైన విజువల్ ట్రీట్‌తో నందమూరి వారసుడిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మోక్షజ్ఞ గ్రాండ్ డెబ్యూపై అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.