రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్..


వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండవ టెస్టులో భారత జట్టు పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో పాటు మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడంతో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ లో సత్తా చాటాడు. అంచనాలకు తగ్గట్లు ఆడాడు. 121 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించాడు.

తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసిన భారత జట్టు రెండో రోజు మిగతా 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు జత చేసింది. తొలి రోజు 87 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రెండో రోజు తన పరుగుల వేటను కొనసాగించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇది 29వ టెస్టు సెంచరీ కాగా, మొత్తంగా 76వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ తర్వాత కూడా కోహ్లీ తన జోరు కొనసాగించాడు. 121 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. కోహ్లీ ఔటైన తర్వాత రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్ జట్టు స్కోర్ పెంచే బాధ్యత తీసుకున్నారు. జడేజా, అశ్విన్ లు అర్ధశతకాలు పూర్తి చేశారు. జడేజా 61 పరుగులు చేయగా, అశ్విన్ 56 పరుగులు చేశాడు. వీరందరూ బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరింది.

తొలి ఇన్నింగ్స్ తొలి రోజు ఆటలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం ఇచ్చారు. జైస్వాల్ 57 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్, అజింక్యా రహానేలు నిరాశ పరిచారు. గిల్ 10 పరుగులు చేయగా, రహానే 8 పరుగులు మాత్రమే చేశాడు.

మొత్తంగా 128 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు కీమర్ రోచ్ 3 వికెట్లు, జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టారు. జాసన్ హోల్డర్ 2 వికెట్లు, షనాన్ గాబ్రియెల్ ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ రూపంలో ఒక వికెట్ లభించింది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 438 పరుగుల వద్ద ముగిసిన తర్వాత విండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్ చంద్రపాల్ వికెట్ రవీంద్ర జడేజా పడగొట్టాడు. 33 పరుగుల వద్ద ఉన్న సమయంలో జడేజా బౌలింగ్ లో షాట్ కొట్టబోయిన చంద్రపాల్ అశ్విన్ కు చిక్కాడు. పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రెయిగ్ బ్రెత్ వైట్, క్రిక్ మెకంజీ బరిలో ఉన్నారు. బ్రెత్ వెయిట్ 37 పరుగుల వద్ద, మెకంజీ 14 పరుగుల వద్ద అజేయంగా నిలిచారు. మూడో రోజు ఆటలో భారత బౌలర్లలో ఎవరు ఎక్కువ వికెట్లు పడగొడతారనే ఆసక్తి క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది.