Site icon TeluguMirchi.com

ఈరోజు నుండి కేటీఆర్ చేతికి కార్…

తెలంగాణ రాష్ట్రసమితి కార్య నిర్వాహక అధ్యక్షునిగా సోమవారం కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ జనసందోహం నడుమ తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుంది. ఉదయం సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి 11.30కి తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వస్తారని సమాచారం.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్‌ను అభినందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణభవన్ పరిసరాలను గులాబీమయంగా మార్చారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా తెలంగాణభవన్ ఆవరణలో ఎల్‌ఈడీలు, మైకులు ఏర్పాటుచేశారు.

మరోపక్క బాధ్యతలు చేపట్టగానే కేటీఆర్ ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధంచేసుకొంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాల సొంత భవనాల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Exit mobile version