
కరోనా దెబ్బకు డబ్బులను సైతం శానిటైజ్ చేయాల్సి వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతుంది. ఏమాత్రం అజాగ్రత్త గా ఉన్న ఈ వైరస్ ప్రాణం తీయచ్చు. అందుకే ప్రతి ఒక్కరు సామజిక దూరం పాటిస్తూ ..మాస్క్ లు ధరిస్తూ కరోనా కు అడ్డుకట్ట వేస్తున్నారు.
తాజాగా డబ్బు నుంచి కూడా కరోనా సోకుతుందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో కొందరు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో ఓ వ్యాపారి రైస్ కుక్కర్‌లో డబ్బును నీటి ఆవిరిలో ఉడకబెడుతున్నారు. కైకలూరులోని విజయలక్ష్మి జనరల్ స్టోర్స్ యజమాని కొత్త నరసింహారావు దుకాణంలో వినియోగదారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్‌లో నీటి ఆవిరిలో ఉడికించి శానిటైజ్ చేస్తున్నారు. తొలుత ఈ ప్రయోగం చేసినప్పుడు డబ్బు కాలిపోయింది. కానీ, తర్వాత ప్రయోగం సఫలమైంది.
‘‘నగదు వివిధ వ్యక్తుల చేతులు మారుతుంది కాబట్టి కరెన్సీ నోట్లతోనూ కరోనా వైరస్ సోకే ప్రమాదముంది. మొదట కరెన్సీ నోట్లను నేరుగా కుక్కర్‌లో ఉంచితే వేడి ఎక్కువై కాలిపోయాయి. తర్వాత కొంచెం నీటిని అడుగున వేసి, మధ్యలో రంధ్రాలున్న ప్లేటును అమర్చడంతో ప్రయోగం ఫలించింది. ఆవిరిలో ఉడకబెట్టడం వల్ల నోట్లపై ఉన్న క్రిములు చనిపోతాయి.’ అని నరసింహారావు చెపుతున్నాడు.









