
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి.
ఇక దేశంలో అతి పెద్ద కోవిడ్ హాస్పిటల్ గాంధీ పై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించింది. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్ గులాబీ పూల వర్షం కురిపించింది. వైద్య సిబ్బంది అంకితభావానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని అక్కడ అధికారులు తెలిపారు.









