Pan India Star: పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి? నెక్ట్స్ లెవల్ ట్యాగ్ ఇదేనా?

Pan India Star

Pan India Star: ఒకప్పుడు హీరోల ఇమేజ్‌ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్.. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో గుర్తింపు ఉండేది. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే పదం చాలా సాధారణంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు సినీ అభిమానుల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత నెక్ట్స్ లెవల్ ఏంటి? అనే ప్రశ్న సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ భాషల్లో మాత్రమే సినిమాలు చేసే హీరోలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమాలు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగం పుంజుకుంది. ప్రభాస్ వంటి హీరోలు ఇండియన్ వైడ్‌గా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే పదానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ను దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో ‘గ్లోబల్ స్టార్’, ‘ఇంటర్నేషనల్ స్టార్’ వంటి కొత్త ట్యాగ్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేయడం మాత్రమే గ్లోబల్ స్టార్‌డమ్‌కు ప్రమాణం కాదనే అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సినిమాకు వచ్చే రెస్పాన్స్, వివిధ దేశాల్లో అభిమానుల ఆదరణ, బాక్సాఫీస్ ప్రభావం, సినిమా కల్చరల్ ఇంపాక్ట్.. ఇవన్నీ కలిసి ఒక హీరోను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే ట్యాగ్‌ను ముందుగా నిర్ణయించడం కంటే.. ఆ స్థాయిని సినిమాలతో సాధించడం ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరికి ఏ ట్యాగ్ అయినా ప్రేక్షకులే ఫిక్స్ చేయాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే హీరోకు స్టార్‌డమ్ తెచ్చేది ఒక పేరు కాదు.. అతడి సినిమాలు, వాటి ప్రభావం, ప్రేక్షకుల ప్రేమే అని కామెంట్స్ చేస్తున్నారు.