
Karthi Upcoming Movies: సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనమున్న కథలను ఎంచుకుంటూ, తెలుగు-తమిళ భాషల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీ. సాధారణంగా ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి కథపై దృష్టి పెట్టే ఈ వెర్సటైల్ యాక్టర్, ఇప్పుడు ఏకంగా బాక్సాఫీస్ వద్ద పక్కా రోడ్‌మ్యాప్‌ను సెట్ చేసి ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఏకంగా అరడజనుకు పైగా ప్రాజెక్టులను ఒకేసారి లైన్లో పెట్టి, రాబోయే రోజుల్లో థియేటర్లలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారు. ఈ లైనప్‌లో సినీ ప్రియులను అమితంగా ఆకర్షిస్తున్న క్రేజీ కాంబినేషన్ కల్యాణ్ శంకర్ ప్రాజెక్ట్. టాలీవుడ్లో ‘మ్యాడ్’ చిత్రంతో యూత్‌ను ఉర్రూతలూగించిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్ డైరెక్షన్లో కార్తీ తన 30వ చిత్రాన్ని లాక్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2027 వేసవి కానుకగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చూడని సరికొత్త యూత్‌ఫుల్ ఎనర్జీతో కార్తీని ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, దర్శకుడు తమిళ్ తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘మార్షల్’ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కొద్దిపాటి షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉండగా, త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టీజర్ ద్వారా అధికారిక అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, కేవలం ఈ రెండు చిత్రాలతోనే కార్తీ ఆగడం లేదు. విభిన్నమైన స్టోరీలతో ప్రేక్షకులను కట్టిపడేసే మోహన్ రాజా, కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన పాండిరాజ్లతో ఇప్పటికే నెక్ట్స్ ప్రాజెక్టులు లాక్ చేశారు. వీటికి తోడు, కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు సుందర్ సి.దర్శకత్వంలో కూడా ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ లైన్లో ఉండటం విశేషం. విభిన్నమైన జానర్లు, బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ల కాంబినేషన్లతో కార్తీ వేస్తున్న ఈ భారీ వ్యూహం చూస్తుంటే.. వచ్చే రెండు, మూడేళ్లు సౌత్ బాక్సాఫీస్‌పై ఆయన పూర్తి ఆధిపత్యం చలాయించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.














