
తెలుగు మిర్చి రేటింగ్: 3/5
Pithapuramlo Ala Modalaindi Review: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ‘ప్రేయసి రావే’ వంటి క్లాసిక్ ఫ్యామిలీ హిట్‌ను అందించిన సీనియర్ డైరెక్టర్ చంద్ర మహేష్, ‘మహేష్ చంద్ర’గా ఈ చిత్రంతో మరోసారి మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నారు. తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధం, నేటి యువత ఆకర్షణకు లోనై తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఒక మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథా నేపథ్యం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని ఓ పల్లెటూరిలో సర్పంచ్ వీర రాఘవ (రాజేంద్రప్రసాద్), పంతులు విశ్వనాథం (కేదార్ శంకర్), మోతుబరి రైతు బంగారయ్య (పృథ్వీరాజ్) ప్రాణస్నేహితులు. వీరి కూతుళ్లు అంజని (ప్రత్యూష), కీర్తన (శ్రీలు), గీత (రిహానా) కూడా ప్రాణానికి ప్రాణంగా కలిసి పెరుగుతారు. ఉన్నత చదువుల కోసం పిఠాపురం కాలేజీకి వెళ్లిన ఈ ముగ్గురు యువతులు అక్కడ ముగ్గురు అబ్బాయిల పరిచయంతో ప్రేమ, ఆకర్షణల్లో పడతారు. ఈ క్రమంలో గీత తన లవర్‌తో కలిసి ఊరు విడిచి వెళ్లిపోతుంది. కీర్తన ప్రేమించిన వ్యక్తితో రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యుల ముందు నిలబడుతుంది. వీరిద్దరి జీవితాల్లో చోటుచేసుకున్న అనూహ్య మలుపులను చూసి అంజని ఒక్కసారిగా అంతర్మథనంలో పడుతుంది. తల్లిదండ్రుల పరువు, నమ్మకం ఒకవైపు.. తన ప్రేమ మరోవైపు ఉన్న పరిస్థితుల్లో అంజని ఏ మార్గాన్ని ఎంచుకుంది? తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఆ ఇద్దరు అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నదే మిగతా స్టోరీ.
ప్లస్ పాయింట్లు
నేటి సమాజానికి ఎంతో అవసరమైన తండ్రీ – కూతుళ్ల అనుబంధాన్ని, యువతలో పెరిగిపోతున్న తొందరపాటు ధోరణిని మేళవించి రాసుకున్న పాయింట్ చిత్రానికి ప్రధాన బలం. సెకండాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు గుండెల్ని హత్తుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. రాజేంద్రప్రసాద్ తన పరిణతి చెందిన నటనతో సర్పంచ్ పాత్రకు ప్రాణం పోశారు. కూతురిపై ప్రేమ, ఆందోళన కలగలిసిన సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. కథను సీరియస్‌గా మాత్రమే నడపకుండా, పృథ్వీరాజ్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చక్కటి రిలీఫ్ అందించారు. GC క్రిష్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది. గోదావరి గ్రామీణ అందాలు, గోవా పాటలోని విజువల్స్ తెరపై కనువిందు చేస్తాయి.
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్రం మంచి సందేశంతో కూడిన స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. ఆకర్షణకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకునే యువతకు, వారి వెనుక నిలబడే తల్లిదండ్రుల వేదనకు అద్దం పడుతూ దర్శకుడు మహేష్ చంద్ర ఈ చిత్రాన్ని వెండి తెరపైకి తెచ్చారు. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా, రాజేంద్రప్రసాద్ అద్భుత నటన, మనసుకు హత్తుకునే ద్వితీయార్థం, క్లైమాక్స్‌లోని భావోద్వేగాలు చిత్రాన్ని పైకి లేపాయి. కుటుంబ సమేతంగా కూర్చుని చూడదగ్గ చిత్రం ఇది.












