Rahul Sankrityan: కోటి మంది ఆకలి చావులు.. ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది

Rahul Sankrityan

Rahul Sankrityan: ఓ పురాతన బుర్రకథ.. దాని వెనుక దాగిన చరిత్ర.. దాదాపు 150 ఏళ్ల క్రితం జరిగిన మహా కరువు. ఈ మూడు అంశాలే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్‌ను ‘రణబాలి’ వైపు నడిపించాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత తన తదుపరి సినిమా కోసం కథను వెతుకుతున్న సమయంలో రాయలసీమకు చెందిన ఓ పురాతన బుర్రకథ తన దృష్టికి వచ్చిందన్నారు. తరతరాలుగా జానపద కథల్లో వినిపించిన ఓ సీమ యోధుడి గాథ ఆయనను ఆకట్టుకుంది. ఆ కథకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తున్న సమయంలో బ్రిటిష్ పాలన కాలంలో చోటుచేసుకున్న మహా కరువు గురించి తనకు తెలిసిందన్నారు. ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, ఆకలి మరణాలు, పాలకుల విధానాల గురించి తెలుసుకున్న తర్వాత తీవ్ర ఆవేదనకు గురయ్యానని రాహుల్ తెలిపారు. అదే భావోద్వేగం ‘రణబాలి’ కథకు బీజం వేసిందని చెప్పారు. చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని ఓ విషాదాన్ని, దానికి ఎదురొడ్డి నిలిచిన తిరుగుబాటు స్ఫూర్తిని సినిమాగా చూపించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ కథకు సరిపోయే హీరో కోసం ప్రత్యేకమైన రూపాన్ని ఊహించుకున్నానని రాహుల్ చెప్పారు. చేతిలో కత్తి, గుర్రంపై స్వారీ చేస్తూ, కళ్లలో రౌద్రంతో కనిపించే యోధుడి తరహా ఇమేజ్ కావాల్సి వచ్చిందన్నారు. ఆ పాత్రకు విజయ్ దేవరకొండ అయితేనే సరిపోతాడని భావించి కథ చెప్పినట్లు తెలిపారు. చరిత్రపై ఆసక్తి ఉన్న విజయ్ వెంటనే అంగీకరించారని చెప్పారు. సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్‌పై ప్రత్యేకంగా వర్క్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘రణబాలి’ కోసం దాదాపు రెండేళ్లు పరిశోధన చేయడంతో పాటు మరో రెండేళ్లు షూటింగ్ నిర్వహించినట్లు రాహుల్ తెలిపారు. అంటే ఈ కథను తెరపైకి తీసుకురావడానికి సుమారు నాలుగేళ్ల సమయం పట్టిందని చెప్పారు. సినిమా టైటిల్‌కు కూడా ప్రత్యేకమైన నేపథ్యం ఉందని దర్శకుడు వివరించారు. యుద్ధానికి ముందు కుమారస్వామి ఎత్తే ఉగ్రరూపాన్ని ‘రణబాలి’గా పేర్కొంటారని, సినిమాలో విజయ్ పాత్ర కూడా అదే స్థాయి తీవ్రతతో కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటి తరానికి ఆహారం నిమిషాల్లో అందుబాటులోకి వస్తున్నా.. ఒకప్పుడు తిండి గింజల కోసం ప్రజలు పడిన కష్టాలు, ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. ఆ కాలంలో జరిగిన పరిణామాలను వినోదంతో పాటు బలమైన భావోద్వేగంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ‘రణబాలి’ లక్ష్యమని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. రాయలసీమ నేపథ్యం, పీరియాడిక్ కథ, యాక్షన్ అంశాలతో ఇప్పటికే ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది.