
Toxic Trailer: రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. దాదాపు ఐదు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో యష్ మరోసారి తనదైన స్టైల్, యాక్షన్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ట్రైలర్‌లోని డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ‘ఐయామ్ సారీ’, ‘యూ ఆర్ హాంటింగ్ మీ లైక్ ఏ ఘోస్ట్’, ‘హూ ది హెల్ ఆర్ యూ?’ వంటి డైలాగ్స్ ట్రైలర్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘దిస్ వాజ్ సపోజ్డ్ టు బీ మై ఫెయిరీ టేల్’ అంటూ వచ్చే డైలాగ్ కథలోని భావోద్వేగ కోణాన్ని సూచిస్తోంది. మరోవైపు ‘డూ ఐ లుక్ సివిలైజ్డ్ టు యూ?’ అంటూ యష్ చెప్పే డైలాగ్ ఆయన పాత్రలోని మాస్ యాంగిల్‌ను చూపిస్తోంది.
‘హలో డాడీ’, ‘ఇట్స్ టైమ్.. ఐయామ్ కమింగ్’, ‘బీ రెడీ టు బ్యాటిల్ చావోస్’ వంటి డైలాగ్స్‌తో ట్రైలర్‌లో యాక్షన్, డ్రామా, క్రైమ్ అంశాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. యష్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ మేకోవర్, యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి సిద్ధం చేసిన ఈ కథను.. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తనదైన స్టైల్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.














