
హీరో నాగచైతన్య నటిస్తున్న భారీ విజువల్ ఎంటర్‌టైనర్ ‘వృషకర్మ’ గ్రాండ్ మీడియా మీట్ హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నాగచైతన్య ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. సినిమా కథ, తన పాత్ర, దర్శకుడు కార్తీక్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్, ప్రస్తుత కమర్షియల్ సినిమా ట్రెండ్‌ల గురించి పలు విషయాలు పంచుకున్నారు.
కమర్షియల్ సినిమా నిర్వచనం గతంలోలా లేదని నాగచైతన్య అన్నారు. పదేళ్ల క్రితం ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉంటే కమర్షియల్ సినిమా అనుకునేవారని, కానీ ఇప్పుడు ఐదు పాటలు ఉన్నాయని చెబితే అవి ఎందుకు పెట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, హీరో అనే ఇమేజ్‌ను పక్కనపెట్టి కథకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమా పూర్తిగా భిన్నమైన ప్రయత్నమని, తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో చేశానని పేర్కొన్నారు. తన కెరీర్‌లోనూ ఒక భారీ విజువల్ స్పెక్టకిల్ మూవీ ఉండాలనే కోరిక ‘వృషకర్మ’తో నెరవేరిందని, ఈ రోజు ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడు తాను ఇండస్ట్రీకి వచ్చింది ఇలాంటి సినిమాల కోసమే అనిపించిందని అన్నారు.
దర్శకుడు కార్తీక్ చెప్పిన కథను విన్న తర్వాత ఒక దశలో షూటింగ్‌లో పూర్తిగా లీనమై, అసలు కథలోని విషయాలను కూడా మర్చిపోయే స్థితికి వెళ్లానని నాగచైతన్య సరదాగా చెప్పారు. దర్శకుడు ఏది చెబితే అది చేస్తూ ముందుకు సాగానని తెలిపారు. ముఖ్యంగా సినిమా చివరి అరగంట గురించి ఇప్పుడే ఎక్కువగా మాట్లాడితే దర్శకుడు తనను తిడతారని, అయితే ప్రేక్షకులు మాత్రం ఆ భాగాన్ని చూసి కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారని ఆసక్తి రేకెత్తించారు. తన తండ్రి నాగార్జున గతంలో చెప్పినట్లుగా ఎడిటర్‌కు నెల రోజుల ముందే సినిమా ఇవ్వలేకపోయామని, అయితే ఆయన సూచనలను పాటించేందుకు ప్రయత్నించామని చెప్పారు. అలా చేయడం వల్ల నిర్మాతకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’లో తన క్యామియో ఉందో లేదో ఆయనే చెబితే బాగుంటుందని అన్నారు. డిసెంబర్ 2న ‘వృషకర్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడిస్తూ, ప్రేక్షకుల ఉత్సాహాన్ని సినిమా విడుదల తర్వాత దర్శకుడు కార్తీక్ కూడా చూస్తారని చెప్పారు.














