
Mythri Movie Makers: టాలీవుడ్లో తిరుగులేని బ్లాక్బస్టర్లతో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు పక్క రాష్ట్రం కోలీవుడ్‌ను కూడా దున్నేస్తోంది. అజిత్ హీరోగా రూపొందించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి అడుగులోనే భారీ కమర్షియల్ హిట్ కొట్టిన ఈ టాలీవుడ్ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. డ్యూడ్, మొద రాత్రి, ఇరుముడి వంటి ప్రాజెక్టులతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ తమిళనాట లక్కీ హ్యాండ్‌గా మారింది. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ కోలీవుడ్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇటీవల ‘మండాడి’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని హీరోగా దూసుకుపోతున్న కమెడియన్ కమ్ స్టార్ యాక్టర్ సూరి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది సూరి కెరీర్లో హీరోగా వస్తున్న 7వ చిత్రం కావడం విశేషం. చెన్నైలో అత్యంత వైభవంగా జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో స్టార్ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత ఎల్. రెడ్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేసి షూటింగ్‌ను ప్రారంభించారు. ‘ఇండ్రు నేట్రు నాళై’, ‘అయిలాన్’ లాంటి డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు రవికుమార్ ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూరికి జోడీగా టాలెంటెడ్ బ్యూటీ రజీషా విజయన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యేర్నేని మాట్లాడుతూ.. ‘‘కోలీవుడ్‌లో మేము నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్, మొద రాతిరి, ఇరుముడి చిత్రాలను తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతోనే ఇక్కడ మరిన్ని చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నటుడు సూరి హీరోగా, రవికుమార్ డైరెక్షన్లో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ, మైత్రీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉందని, హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి ఇమేజ్‌కు తగ్గట్టుగా, అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ధీమా వ్యక్తం చేశారు.














