Nagarjuna: చైతూ, అఖిల్‌.. ఆ బోల్డ్ స్టెప్ తీసుకోండి: నాగార్జున

Nagarjuna

Nagarjuna: తన కెరీర్‌లో తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయని అక్కినేని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో కలిసి చేసిన ‘గీతాంజలి’ సినిమా తన సినీ ప్రయాణంలో కీలకమైన మలుపుగా నిలిచిందని తెలిపారు. ఆ సమయంలో తనలాంటి స్టార్ హీరోలు అలాంటి కథలను ఎంచుకోవడానికి పెద్దగా ముందుకు రాని పరిస్థితుల్లో తాను మాత్రం ధైర్యంగా ఆ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుమారులు నాగచైతన్య, అఖిల్ గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో తీసుకున్నట్లుగానే వారు కూడా తమ కెరీర్‌లో కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కేవలం సేఫ్ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, తమను తాము కొత్తగా ఆవిష్కరించే కథలు, పాత్రలను ఎంచుకోవాలని అభిప్రాయపడ్డారు.

అయితే 90వ దశకంతో పోలిస్తే ప్రస్తుతం సినీ పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నాగార్జున పేర్కొన్నారు. అప్పట్లో ఒక హీరో వరుసగా కొన్ని సినిమాలు విఫలమైనా తిరిగి మంచి సక్సెస్ తో కెరీర్‌ను గాడిలో పెట్టుకునే అవకాశం ఉండేదని చెప్పారు. ఏడు సినిమాలు వరుసగా ఫెయిల్ అయినా ప్రేక్షకులు మరో అవకాశం ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం, పోటీ కారణంగా పరిస్థితులు మరింత కఠినంగా మారాయని అన్నారు. ఇప్పటి ప్రేక్షకులు ఒక హీరో ఎంచుకున్న సినిమా లేదా కెరీర్ పంథాను అంగీకరించకపోతే చాలా త్వరగా మరో నటుడి వైపు దృష్టి మళ్లించే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. అందుకే చైతన్య, అఖిల్ తమ కెరీర్‌లో కొత్తదనం కోసం ప్రయత్నించడంతో పాటు, అందుకు తగిన రిస్క్ తీసుకునే ధైర్యం కూడా కలిగి ఉండాలని సూచించారు. ‘గీతాంజలి’ తన కెరీర్‌కు దిశానిర్దేశం చేసినట్లే, తన కుమారులు కూడా తమకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవాలని నాగార్జున ఆకాంక్షించారు.