
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న మరో ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్ర నిర్మాతలు వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మాణంలో దర్శకుడు మధుకర్ రెడ్డి కోమిరెడ్డి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. “Based on a True Story” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నదమ్ముల మధ్య రామలక్ష్మణుల్లా ఉన్న బంధం, ఆస్తి తగాదాలు, గ్రామ రాజకీయాలు, ప్రేమ, ద్వేషం, కుటుంబ అనుబంధాలు వంటి అంశాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు పోస్టర్‌లోని వివరాలు సూచిస్తున్నాయి.
ఈ చిత్రం కోసం తెలంగాణ యాస, భాష తెలిసిన నటీనటుల నుంచి ఆడిషన్లను ఆహ్వానిస్తున్నారు. కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేకర్స్ కాస్టింగ్ కాల్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు తమ ఆడిషన్ వీడియోలను [email protected] మెయిల్‌కు లేదా 8096411437 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను పరిగణనలోకి తీసుకోబోమని మేకర్స్ స్పష్టం చేశారు. తెలంగాణ మట్టివాసనతో, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతోంది.









