
Sankranti: టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే భారీ సినిమాల పోటీకి వేదికగా నిలుస్తుంది. వచ్చే సంక్రాంతి బరిలో కూడా స్టార్ హీరోల చిత్రాలు పోటీపడేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ, హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నిర్మాతలు శిరీష్, రాజు ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ నిర్ణయానికి ముందు నిర్మాతలు రాజు- శిరీష్.. డైరెక్టర్ అనిల్ రావిపూడికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడితో వారికి ఉన్న సన్నిహిత అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, తమ సినిమా కూడా అదే సీజన్లో విడుదల కానుందని ముందుగానే తెలియజేసినట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలు రాకుండా, వారి సంబంధాలపై ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజు-శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనులు కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ–శ్రీవిష్ణు సినిమా కూడా అదే పండుగ సీజన్‌ను టార్గెట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై సంబంధిత నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














