Varanasi: ‘వారణాసి’ మేకింగ్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీ.. రాజమౌళి – మహేశ్‌ మూవీ కోసం భారీ ప్లాన్!

Varanasi

Varanasi: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కేల్‌లో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాన్ని, మేకింగ్‌ విశేషాలను ప్రేక్షకులకు చూపించేందుకు మేకర్స్‌ ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘వారణాసి’లో ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడని స్థాయిలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు, గ్రాండ్‌ సెట్స్‌, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్‌ యానిమల్స్‌తో చిత్రీకరిస్తున్న క్లిష్టమైన సన్నివేశాల వెనుక చిత్రబృందం పడుతున్న శ్రమను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు సమాచారం.

ఈ మేకింగ్‌ డాక్యుమెంటరీ కోసం ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ గోగితా చిక్వైడ్జే పనిచేస్తున్నట్లు IMDbలోని వివరాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా షూటింగ్‌ నుంచి తెరవెనుక ఆసక్తికరమైన ఘటనలు, భారీ సన్నివేశాల రూపకల్పన, నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమ, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రక్రియ వంటి అంశాలను డాక్యుమెంటరీలో పొందుపరిచే అవకాశం ఉందట. కేవలం సినిమా విడుదల వరకే ఈ కంటెంట్‌ను పరిమితం చేయకుండా.. ప్రమోషనల్‌ కంటెంట్‌గా లేదా సినిమా విడుదల అనంతరం ప్రత్యేక ఫీచర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. ‘వారణాసి’ నిర్మాణం వెనుక ఉన్న మనుషులను, వారి కథలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే ఈ డాక్యుమెంటరీ ఉద్దేశంగా తెలుస్తోంది. మహేశ్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఇప్పటికే ‘వారణాసి’పై భారీ క్రేజ్‌ నెలకొంది. ఇప్పుడు మేకింగ్‌ డాక్యుమెంటరీ వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.