
చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించడం సంచలనంగా వుంది. ‘మొదటి దశ వైరస్ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్ కేసులు ఉండేవని మా అంచనా’ అని ఫెంగ్‌వూ నేతృత్వంలోని హాంకాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అన్నారు.
వైరస్ బాధితులను గణించే ప్రమాణాల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. దీనిని ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) ప్రకారం బుధవారం నాటికి ఆ దేశంలో 82,789 కేసులు నమోదవ్వగా 4,632 మంది మరణించారు. అధ్యయనం ప్రకారం ఈ సంఖ్యకు నాలుగురెట్ల కేసులు అక్కడ ఉంటాయి. కొవిడ్-19 రోగుల సంఖ్య, వైరస్ ప్రభావాన్ని తగ్గించి చెబుతోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. ఇపుడు ఆ అధ్యయనం మరింత అనుమానాలు రేకెత్తిస్తుంది.









