
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో చేతులు కలిపింది ఫేస్బుక్. ఈ సంస్థ జియోతో కలిపి భారీ పెట్టుబడిపెట్టనుంది. జియో ప్లాట్పామ్స్లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574 కోట్లు. ఈ మేరకు ఇరు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. తాజా వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్బుక్ నిలవనుంది.
‘‘ ఇండియాలో చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలన్నదే మా లక్ష్యం. ముఖ్యంగా దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆరు కోట్ల చిన్న తరహా వ్యాపారాలకు అండగా నిలవాలనుకుంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారిని ఏకం చేయాలనుకుంటున్నాం. కరోనా సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్బుక్ బంధం బాటలు వేస్తుందని భావిస్తున్నాం’’ అని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.









