Site icon TeluguMirchi.com

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: మేయర్ విజయలక్ష్మి

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటామని మేయర్ వెల్లడించారు. గౌరవ మంత్రి వర్యులు కె.టి.ఆర్ గారి ఆదేశాల మేరకు తాను, మున్సిపల్, పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ లతో కలిసి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని తక్షణ చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పడు పరిశీలించి, పర్యవేక్షించి అధికారులతో తగు ఆదేశాలు జారీచేస్తామని అన్నారు.  15 రోజులలో చేపట్టిన చర్యలను మరోసారి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్, పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ…జవహర్ నగర్ డంప్ యార్డ్ ద్వారా వస్తున్న దుర్వాసనను తొలగించేందుకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయించడంతో పాటు వెంటనే తొలగించేందుకు ఏజెన్సీని ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం అదనంగా మరో 28 మెగా వాట్ల సామర్థ్యం గల పవర్ యూనిట్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ .డి.ఎస్.లోకేష్ కుమార్, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version