Site icon TeluguMirchi.com

జగన్’తో కేటీఆర్ భేటీ హైలైట్స్

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీసీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల సమావేశం ముగిసింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు.

జగన్ మాట్లాడుతూ.. ‘ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయం. ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్‌తో చర్చించాం. జాతీయస్థాయిలో రాష్ట్రాలకి జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే కేంద్రాన్ని నిలదీయగలం. ఫెడరల్ ఫ్రంట్‌పై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయి. ఇవి ఇకముందు కూడా కొనసాగనున్నాయి’ అన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ ఇప్పటికే చర్చించారు. ఈ క్రమంలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై మాట్లాడేందుకు జగన్ వద్దకు వచ్చాం. త్వరలో ఏపీకి వెళ్లి అక్కడి నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతారు’ అని అన్నారు

Exit mobile version